New Delhi: ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయి: ఢిల్లీలో చంద్రబాబు

  • చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నారు
  • ఈవీఎంలతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది
  • తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేశారు

ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ లో క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విపక్షపార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చాలా దేశాలు ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్ కు వచ్చాయని చెబుతూ, జర్మనీ లాంటి అభివృద్ధి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్ వాడుతున్న విషయాన్ని ప్రస్తావించారు.

ఈవీఎంలు వినియోగిస్తే ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో 25 లక్షల ఓటర్లను తొలగించారని, అక్కడ జరిగిన ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ ‘సారీ’ చెప్పి చేతులు దులుపుకుందని అన్నారు. తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఇబ్బంది తప్పలేదని, ఏపీలో ఎన్నికల నిర్వహణ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.

వీవీ ప్యాట్స్ స్లిప్స్ 7 సెకన్లకు బదులు 3 సెకన్లే ఉన్నాయని, ఇది ఎలా మారిపోయిందని ప్రశ్నిస్తే, ఈసీ దగ్గర సమాధానం లేదని అన్నారు. తమ అధికారులను ఈసీ బదిలీ చేసిందని, తమ పార్టీ నేతలపై ఈడీ, ఐటీ అధికారులతో దాడులు చేయిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఈసీ కాపాడలేకపోతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News