Andhra Pradesh: మాకు సంస్కారం ఉంది కాబట్టే చంద్రబాబును పెంపుడు కుక్క అని అనలేదు!: టీఆర్ఎస్ నేత కేటీఆర్
- టెక్నాలజీ తనవల్లే వచ్చిందని బాబు చెబుతారు
- మోదీతో అంటకాగిన బాబును కుక్క అనలేమా?
- జగన్, కేసీఆర్ హుందాగా వ్యవహరించారు
ఎన్నికల్లో ఏ పార్టీలు కూడా ఒక్క పథకంతో అధికారంలోకి రాలేవనీ, విజయం సాధించడంపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. టెక్నాలజీ తన వల్లే వచ్చిందని చంద్రబాబు చెబుతుంటారనీ, అలాంటి వ్యక్తి ఈరోజు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయంటూ చెప్పడం బాధాకరమన్నారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో కేటీఆర్ పలు అంశాలపై ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కేసీఆర్ లక్ష్యంగా చేసిన విమర్శలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్, జగన్ లు మోదీ పెంపుడు కుక్కలు అంటూ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగేళ్లు మోదీతో అంటకాగారనీ, కాబట్టి తాము కూడా ఆయన్ను పెంపుడు కుక్క అని అనగలమని వ్యాఖ్యానించారు.
తమకు సంస్కారం ఉంది కాబట్టే అలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేసీఆర్, జగన్ హుందాగా వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై పెడబొబ్బలు పెట్టడం చంద్రబాబుకే మంచిది కాదని సూచించారు.