Begumpet: బేగంపేట ఎయిర్ పోర్టు కింద అండర్ గ్రౌండ్ రోడ్!
- 1.1 కిలోమీటర్ల పొడవైన రహదారి
- తాడ్ బండ్ కు మరింత వేగంగా వెళ్లేలా రోడ్డు
- మరో 8 నూతన రహదారులకు ప్రతిపాదనలు
హైదరాబాద్ లోని ఓల్డ్ ఎయిర్ పోర్ట్ ఉన్న బేగంపేట, తాడ్ బండ్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఓ సరికొత్త అండర్ గ్రౌండ్ మార్గాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనలు బల్దియాకు వచ్చాయి. ఓ ప్రైవేటు ఏజన్సీ అధ్యయనం చేసి అందించిన వివరాల మేరకు, మొత్తం 1.1 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని బేగంపేట ఎయిర్ పోర్టు గేటు నుంచి, రన్ వే కిందుగా, ప్రహరీ గోడను దాటిస్తారు.
అక్కడి నుంచి తాడ్ బండ్ వరకూ 1.5 కి.మీ. రహదారిని నిర్మించాలి. దీనివల్ల సుమారు 5 కి.మీ. మేరకు ప్రయాణ దూరం తగ్గడంతో పాటు పలు ట్రాఫిక్ కూడళ్ల వద్ద రద్దీ తగ్గుతుంది. బేగంపేట సొరంగ మార్గంతో పాటు మరో 8 నూతన రహదారుల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు వచ్చాయని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
పలు ప్రాంతాల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించేలా కొత్త మార్గాలు ఉంటాయని, భూ సేకరణకు పెద్దగా ఇబ్బందులు తలెత్తకుండా, ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల గుండా ఈ నూతన మార్గాలు సాగేలా చూస్తామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. కాగా, బేగంపేట ఎయిర్ పోర్టు రన్ వే కింద నుంచి సొరంగాన్ని తవ్వాలంటే, కేంద్రం నుంచి అనుమతి తప్పనిసరి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను పొందడం అంత సులువేమీ కాదని, అయినా, తమ వంతు ప్రయత్నాన్ని చేస్తామని అధికారులు అంటున్నారు.