Jagapathi Babu: ఆ సమయంలో డబ్బు కోసం పరమచెత్త సినిమాల్లో కూడా నటించాను: జగపతిబాబు
- మనసు చంపుకుని నటించాను
- ఎంతిస్తే అంత తీసుకున్నాను
- ప్రతి ఒక్కరి జీవితంలో దుర్దశ ఉంటుంది
టాలీవుడ్ లో ఇప్పుడు జగపతిబాబు కెరీర్ ఘనంగా నడుస్తోంది. హీరోగా చేసిన సమయంలో అనేక ఎత్తుపల్లాలు చవిచూసిన ఆయన ఇప్పుడు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తిరుగులేని డిమాండ్ తో దూసుకుపోతున్నారు. తాజాగా, ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో తన జీవితంలో అత్యంత హీనదశ గురించి వివరించారు. 2008-09 నుంచి 2012 వరకు చీకటిరోజులుగా పేర్కొన్నారు.
ఆ సమయంలో డబ్బు కోసం పరమచెత్త సినిమాలు కూడా చేశానని తెలిపారు. నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకుని నటించానని గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా మనసు చంపుకుని ఆ విధంగా చేయాల్సి వచ్చిందని జగపతిబాబు బాధను వ్యక్తం చేశారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆవిధంగా చేయకతప్పలేదని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి దుర్దశ ఉంటుందని జగపతిబాబు అభిప్రాయపడ్డారు.
అంతకుముందు మాట్లాడుతూ, తన తండ్రి, ప్రముఖ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ దసరాబుల్లోడు వంటి సూపర్ హిట్ సినిమా తీసి కూడా పెద్దగా ఏమీ మిగుల్చుకోలేకపోయారని వెల్లడించారు. ఆ రోజుల్లో తన తండ్రి ఎన్నో సినిమాలు తీసినా రాబడి కంటే ఖర్చే ఎక్కువగా ఉండేదని తెలిపారు. తాను హీరో అయిన తర్వాత తనపై ఖర్చుపెట్టి మరింత డబ్బు పోగొట్టుకున్నారని జగపతిబాబు నిజాయతీగా అంగీకరించారు.