KTR: ఇప్పటికే విపక్షాలకు అడ్రస్ గల్లంతైంది, ఈసారి కూడా సేమ్ రిజల్ట్!: కేటీఆర్ ధీమా
- 32 జడ్పీ పీఠాలే మన లక్ష్యం కావాలి
- శ్రేణులు ఆ దిశగా కృషి చేయాలి
- జనరల్ సెక్రటరీల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు
టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టిన టీఆర్ఎస్ అధినాయకత్వం జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఇప్పటికే విపక్షాలు అడ్రస్ లేకుండా పోయాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా ప్రతిపక్షాలకు తీవ్ర నిరాశ తప్పదని జోస్యం చెప్పారు.
తమ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జెడ్పీ చైర్మన్ పీఠాలను గెలుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు అన్ని జిల్లాల జడ్పీ పీఠాలే లక్ష్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలవారీగా 'స్థానిక' స్థితిగతులపై సమీక్షించారు.