YSRCP: లా పవర్ ఏంటో చూపిస్తా, నన్ను వ్యక్తిగతంగా దూషించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను: పీవీపీ
- నాపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా?
- ఒక్కొక్కరిపై రూ.100 కోట్లకు దావా వేస్తా
- ప్రధానిని 420 అని పిలిచిన వ్యక్తే ఓ 420
వైసీపీ నేత, విజయవాడ పార్లమెంటు స్థానం అభ్యర్థి పీవీపీ వరప్రసాద్ ఎన్నికల సందర్భంగా తాను ఎదుర్కొన్న పరిణామాలపై ఘాటుగా స్పందించారు. తనను వ్యక్తిగతంగా దూషించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తనపై దుష్ప్రచారం చేసిన వాళ్లకు చట్టానికి ఉన్న పవరేంటో చూపిస్తానని అన్నారు.
ఒక్కొక్కరిపై రూ.100 కోట్లకు దావా వేస్తానని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేశాయంటూ టీవీ5, మహాన్యూస్ చానళ్లతో పాటు తనను కించపరిచిన ఎంపీ (కేశినేని నాని!) పైనా పరువునష్టం దావా వేస్తున్నట్టు పీవీపీ వెల్లడించారు. కోల్ గేట్ స్కాంలో సీబీఐ తనపేరును చార్జిషీటులో పొందుపరచకపోయినా ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రధానమంత్రిని మిస్టర్ 420 అని పిలిచిన వ్యక్తి ఒక 420 అని ఎద్దేవా చేశారు.