West Bengal: కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీకి పశ్చిమబెంగాల్ సీఎం మమత షాక్...హెలికాప్టర్ ల్యాండింగ్‌కు నో
- సిలిగురిలో దిగేందుకు అనుమతి నిరాకరణ
- రెండు రోజుల ముందు సమాచారం ఇచ్చిన అధికారులు
- దీదీ తీరుపై మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు
ఎన్నికల వేళ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. సిలిగురిలో ఈనెల 14న నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్న రాహుల్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. సభకు సరిగ్గా రెండు రోజుల ముందు డార్జిలింగ్ జిల్లా అధికారులు ఈ విషయాన్ని తెలియజేసి కాంగ్రెస్ చీఫ్‌కు షాకిచ్చారు.
మమతా బెనర్జీ సర్కారు తీరుపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. తమ నేత విషయంలో తృణమూల్ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ‘మా అధినాయకుడి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని తృణమూల్ ప్రభుత్వం చూస్తోందంటే ఆయన వల్ల ఎంత నష్టం జరుగుతుందో అని భయపడుతున్నట్టే’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, డార్జిలింగ్ లోక్ సభ అభ్యర్థి శంకర్ మలాకర్ అన్నారు.
హెలికాప్టర్ ల్యాండింగ్, రాహుల్ సభకు సంబంధించిన అన్ని పత్రాలను తాము సకాలంలో సమర్పించినప్పటికీ ఇటువంటి చౌకబారు ఎత్తుగడలతో ఆయన రాకను అడ్డుకోవాలని చూడడం దారుణమన్నారు. బహిరంగ సభ నిర్వహణకు ఏప్రిల్ ఏడునే అనుమతులు ఇచ్చిన అధికారులు, ఇప్పుడు రాహుల్ రాకను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. డార్జిలింగ్‌లో ఈనెల 18వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇంత తక్కువ వ్యవధిలో ఎస్పీజీ భద్రత ఉన్న నాయకుడి ఎన్నికల పర్యటన రీషెడ్యూల్ చేయడం అంత సులువుకాదని శంకర్ అన్నారు.