Chandrababu: ఈవీఎంలు పనిచేయకపోతే జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎందుకని?: చంద్రబాబు సూటి ప్రశ్న
- కుమ్మక్కయ్యారు
- ఈసీని నిలదీయకుండా మెచ్చుకున్నారు
- దీన్ని అందరూ గమనించాలి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పోలింగ్ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పైనా, ఎన్నికల సంఘం పనితీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఈవీఎంలు పనిచేయని కారణంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురైతే వైసీపీ కార్యకర్తలు ఈసీని ప్రశ్నించకుండా తమపై దాడికి దిగారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ సైతం లోటస్ పాండ్ లో కూర్చున్నాడు తప్పితే ఈవీఎంల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.
"రాష్ట్రంలో కొన్ని వందల ఈవీఎంలు మొరాయించాయి. దాంతో కొన్ని నియోజకవర్గాల్లో అర్థరాత్రి వరకు ఓటింగ్ జరిగింది. తాడేపల్లి క్రిస్టియన్ పేట పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే సమస్య వచ్చింది. అర్ధరాత్రి సమయానికి కూడా అక్కడ క్యూలో ఓటర్లు ఉన్నారు. అక్కడికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు ఓటర్ల పరిస్థితికి ఈసీని ప్రశ్నించకుండా మా మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు ఈవీఎంల గురించి ఎన్నికల సంఘాన్ని ఒక్క మాట కూడా అనలేదు. పైగా మా మీదే దాడులు చేశారు. ఈసీని నిలదీయాల్సిందిపోయి ఇంకా మెచ్చుకున్నారు. వాళ్లకు సహకరించారు కాబట్టి అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇది అందరూ గమనించాల్సిన విషయం" అంటూ వివరించారు.