Nara Lokesh: గంట నుంచి అరుస్తున్నా... ఒక్కడూ కనిపించడే!: ఎన్నికల అధికారులపై నారా లోకేశ్ ఆగ్రహం

  • మంగళగిరిలో ఉద్రిక్తత
  • 37వ పోలింగ్ బూత్ వద్ద లోకేశ్ ధర్నా
  • ఈసీపై తీవ్ర మండిపాటు

ఏపీ మంత్రి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని 37వ పోలింగ్ కేంద్రం (క్రిస్టియన్ పేట) వద్ద ఆయన రాకతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధికారులు ఎవరూ స్పందించలేదంటూ లోకేశ్ మండిపడ్డారు.

" ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఇదేనా? ఐదేళ్లకోసారి ఎన్నికలు కూడా సజావుగా నిర్వహించలేరా? అందుకే ధర్నాకు దిగాను. అరే, అధికారులు ఎవరంటే ఒక్కరూ కనబడరే?  ఇంత పెద్ద బూత్ లో పోలింగ్ అధికారి తప్ప ఇతర అధికారులు ఒక్కరూ ఉండరా? గంట నుంచి అరుస్తున్నా ఒక్కరూ  రారే? కనీస సౌకర్యాలు ఉన్నాయా ఇక్కడ? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అందుకే కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి ఇక్కడున్న మా ఓటర్లకు క్షమాపణలు చెప్పేదాకా ఇక్కడ్నించి కదలదలుచుకోలేదు.

మంగళగిరి నియోజకవర్గంలో ఓటర్లను ఓటేయనివ్వకుండా చాలా జాగ్రత్తగా తారుమారు చేశారు. ఈ విషయం పార్టీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూత్ ల సమాచారం వచ్చాక నేనే ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి ఈ విషయం తేల్చుకుంటాను" అంటూ నిప్పులు చెరిగారు.

ఇది ఎన్నికల కమిషనర్ సొంత బూత్ అని, ఆయన స్వయంగా పర్యవేక్షించాల్సిన పోలింగ్ కేంద్రం అని లోకేశ్ వెల్లడించారు. ఆయన కూడా ఇక్కడ ఉండాలి కదా? ఎక్కడ పోలింగ్ కమిషనర్? అంటూ నిలదీశారు. ఉదయం ఏవో సాంకేతిక లోపాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యానని సర్దిచెప్పుకున్నా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తమకు వ్యతిరేకంగా కుట్ర పన్నినట్టు అర్థమవుతోందని నారా లోకేశ్ ఆరోపించారు. ఓటింగ్ శాతం తగ్గించాలన్నదే వాళ్ల ప్రధాన ఉద్దేశమని అన్నారు.

  • Loading...

More Telugu News