Anantapur District: ఈవీఎంను నేను నేలకేసి కొట్టలేదు.. నా చెయ్యి తగిలి కిందపడింది: ‘జనసేన’ అభ్యర్థి మధుసూదన్ గుప్తా

  • ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎక్కడ ఓటేయాలన్న సూచనలు లేవు
  • అందుకే, ఈ విషయమై అధికారులను ప్రశ్నించా
  • వాళ్లు నాకు సమాధానం చెప్పలేదు 

అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా తన ఓటు వేసేందుకు గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌కు ఈరోజు వెళ్లడం, అక్కడి ఈవీఎంను నేలకేసి కొట్టడం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై మధుసూదన్ గుప్తా స్పందిస్తూ, ఈవీఎం తన చేయి తగిలి కింద పడి పగిలిపోయిందని చెప్పారు. తాను ఓటు వేసేందుకని ఈరోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ కేంద్రానికి వెళ్లానని, అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎక్కడ ఓటు వేయాలన్న సూచనలు లేవని ఆరోపించారు.

గుంతకల్‌లో జనసేన తరపున అసెంబ్లీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, తమ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థి ఎవరూ ఇక్కడి నుంచి పోటీ చేయట్లేదని, ఇలాంటి సూచనలు లేకపోవడం వల్ల తాను నష్టపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే, వారు ఎటువంటి సమాధానం చెప్పలేదని, అదే సమయంలో తన చేయి తగిలి ఈవీఎం కిందపడి పగిలిపోయిందని సమర్థించుకున్నారు.

కాగా, ఈవీఎంను మధుసూదన్ గుప్తా నేలకేసి కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. ‘ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ఎక్కడ ఓటు వేయాలన్నది ఎందుకు స్పష్టం చేయలేదు?’ అంటూ ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. ఇదంతా బోగస్, ఇంత అన్యాయంగా ఎన్నికలు నిర్వహిస్తారా? అంటూ అక్కడి ఎన్నికల సిబ్బందిపై ఆయన విరుచుకుపడటం ఈ వీడియోలో కనబడుతుంది.

Anantapur District
guntakal
gutti
janasena
Evm
madhu sudhan gupta
  • Loading...

More Telugu News