Andhra Pradesh: ఏపీ ఎన్నికల సంఘంపై బీజేపీ నేత జీవీఎల్ అసహనం!
- ఈసీ సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించింది
- అందుకే కొన్ని పోలింగ్ బూత్ లు ఖాళీగా ఉన్నాయి
- గుణదలలోని లయోలా కాలేజీలో ఓటేసేందుకు వచ్చిన నేత
బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈరోజు ఎన్నికల సంఘంపై అసహనం వ్యక్తం చేశారు. ఈసీ సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల ఓటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. తమకు ప్రత్యేకంగా ఓటేసే అవకాశం ఇచ్చినప్పటికీ గంట పాటు క్యూలైన్లో నిల్చుని ఉన్నామని జీవీఎల్ తెలిపారు. ఇది పూర్తయ్యేందుకు ఇంకో గంట సమయం పట్టవచ్చన్నారు. తాను గుణదలలోని లయోలా కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చానని పేర్కొన్నారు.
తమ పోలింగ్ బూత్ లో 1,796 మంది ఓటర్లు ఉంటే పక్కనే ఉన్న బూత్ లలో వరుసగా 322, 535 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. అయితే ఈ రెండు పోలింగ్ బూత్ లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈసీ ప్లానింగ్ లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.