Andhra Pradesh: ఏపీ ఎన్నికలు... ముఖ్యమైన వివరాలు!
- మరికొన్ని గంటల్లో ఎన్నికలు
- మొత్తం ఓటర్ల సంఖ్య 5.30 కోట్లకు పైనే
- గాజువాకలో అత్యధిక ఓటర్లు, పెడనలో అత్యల్పం
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఓటర్లు, నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ జనవరి నాటికి ఏపీలో జనాభా 5,30,01,971. అందులో మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717. పురుష ఓటర్ల సంఖ్య 1,94,62,339 కాగా, స్త్రీలు 1,98,79,421. ట్రాన్స్ జెండర్లు 3,967. అత్యధిక ట్రాన్స్ జెండర్ ఓటర్లు కాకినాడ సిటీలో 142, భీమవరంలో 104 మంది ఉండగా, అమలాపురంలో అసలు లేరు.
ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధిక ఓటర్లు గాజువాకలో 3,09,326 మంది, భీమిలీలో 3,05,958 మంది ఉండగా, అత్యల్పంగా పెడనలో 1,66,177, నరసాపురంలో 1,68,122 మంది ఉన్నారు. ఈ ఎన్నికల కోసం ఏపీలో మొత్తం 45,920 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, పట్టణ ప్రాంతాల్లో 7,973, గ్రామీణ ప్రాంతాల్లో 37,947 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీలు 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ పడుతుండగా, జనసేన 137 అసెంబ్లీ సీట్లు, 16 పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తూ, మిగతా వాటిని మిత్రపక్షాలకు అప్పగించింది. బీఎస్పీ 13 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లకు, సీపీఎం, సీపీఐలు ఏడేసి అసెంబ్లీ, రెండేసి లోక్ సభ సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ 173 అసెంబ్లీ సీట్లు, 24 లోక్ సభ సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 174 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లలో అభ్యర్థులను నిలిపింది. ఇతర పార్టీల వారు అన్ని నియోజకవర్గాల్లోనూ 1,249 మంది అసెంబ్లీకి, 193 మంది పార్లమెంట్ కు పోటీ పడుతున్నారు.
అసెంబ్లీకి పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 2,118 కాగా, అందులో పురుషులు 1,945 మంది. స్త్రీలు 172 మంది, ట్రాన్స్ జెండర్ ఒకరు. పార్లమెంట్ విషయానికి వస్తే అభ్యర్థుల సంఖ్య 319 కాగా, పురుషులు 292, మహిళలు 27 మంది. ఇక అత్యధిక పోటీ ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తే, గుంటూరు వెస్ట్ నుంచి 34 మంది, మంగళగిరి నుంచి 32 మంది, కర్నూలు నుంచి 28 మంది, గుంటూరు ఈస్ట్ నుంచి 27 మంది, విజయవాడ వెస్ట్ నుంచి 22 మంది, మైలవరం నుంచి 18 మంది పోటీలో ఉన్నారు.
తక్కువ మంది పోటీలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లను చూస్తే, ఇచ్చాపురం, రాజాం, ఆముదాలవలస, కురుపాం, బొబ్బిలి నుంచి ఆరుగురు చొప్పున పోటీలో ఉండగా, కోవూరు, మడకశిర, గోపాలపురం, పార్వతీపురం, పాలకొండ నుంచి ఏడుగురు చొప్పున, ఏలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, దర్శి, మచిలీపట్నం, ఉంగుటూరు, నర్శీపట్నం, చీపురుపల్లి, సాలూరు, శ్రీకాకుళం, పాతపట్నం, టెక్కలి నుంచి 8 మంది చొప్పున పోటీలో నిలిచారు.
అత్యధికులు పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాలను పరిశీలిస్తే, నంద్యాల నుంచి 20 మంది బరిలో ఉండగా, అత్యల్పంగా చిత్తూరు నుంచి కేవలం 8 మంది మాత్రమే పోటీలో ఉన్నారు.