Chandrababu: శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా... ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: చంద్రబాబు

  • నేను కావాలా? ఆర్థిక నేరస్తుడు కావాలా?
  • ఇది నాకోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం
  • నన్ను చూసి ఓటేయండి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం ముగించుకుని, చివరిగా అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో ఓవైపు ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే కాకుండా, మరోవైపు ప్రజలకు తన మనసులో మాటను తెలియజేశారు. తనది ధర్మపోరాటం అని, తాను కావాలో, ఆర్థిక నేరస్తుడు కావాలో ఏపీ ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు.

"సంక్షేమాన్ని కులంగా తీసుకున్నాను, అభివృద్ధిని మతంగా తీసుకున్నాను. 24 గంటలూ పనిచేస్తున్నాను. అందరివాడిగా ఉండాలన్నదే నా అభిమతం. ఏ కొద్దిమందికో చెందినవాడిగా ఉండడం నాకు నచ్చని విషయం. ఈ రోజు కులాలు, మతాలు, ప్రాంతాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎంతో దుర్మార్గమైన విషయం అది. ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి.

నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో నేను వస్తే ఏం జరుగుతుంది? ఆర్థిక నేరస్తులు వస్తే ఏం జరుగుతుంది? నేనొస్తే మీ బిడ్డల భవిష్యత్తు పదిలంగా ఉంటుంది, అది నా బాధ్యత. ఆర్థిక నేరస్తుడు వస్తే అరాచకం పది రెట్లు పెరిగిపోతుంది. నేనొస్తే మీ భూముల భద్రత పది రెట్లు పెరుగుతుంది. వాళ్లొస్తే అవినీతి పదిరెట్లు పెరుగుతుంది, ఆగడాలు విపరీతం అవుతాయి. ఈ ప్రభుత్వంతో పసుపు-కుంకుమ పదిరెట్లు పెరిగితే, వాళ్లొస్తే పసుపు-కుంకుమ తీసేసే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలు పదిరెట్లు వస్తాయి. వాళ్లొస్తే పరిశ్రమలు పారిపోతాయి.

మేము పోలవరం, అమరావతి పూర్తిచేస్తాం. వీళ్లొస్తే రెండూ ఆగిపోతాయి. మా ప్రభుత్వంలో మైనారిటీలను ఆదుకుంటాం. మైనారిటీల భద్రత, భవిష్యత్తు సుభిక్షంగా ఉంటుంది. ఆర్థిక నేరస్తుడికి ఓటేస్తే నరేంద్ర మోదీకి ఓటేసినట్టు అవుతుంది. అప్పుడే దేశంలో ఏ మైనారిటీకి కూడా భద్రత ఉండదు. బీసీలు, ఎస్సీ ఎస్టీలను, అగ్రవర్ణాల పేదలందరినీ ఆదుకుంటామని మరోసారి చెబుతున్నాను.

ఈ రోజు శిరస్సు వంచి రాష్ట్ర ప్రజలందరికీ పాదాభిందనం చేస్తూ ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాను.  ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇది నాకోసం కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. నేను పోరాడుతున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీతో, మనకు అన్యాయం చేసే కేసీఆర్ తో. ఇక్కడ ఉండే జగన్ వాళ్లతో లాలూచీ పడి రాష్ట్రాన్ని అన్నివిధాలా దెబ్బతీసేందుకు కంకణం కట్టుకుని ప్రయత్నిస్తున్నాడు.

ఆ రోజు రాష్ట్రవిభజన అనంతరం ఎన్నో ఇబ్బందులతో వచ్చాం. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాం. అందుకే ఈ ఐదేళ్లు ఎంతో కీలకం. ఈ కీలక సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి సైకిల్ గుర్తుకే ఓటేయమని, టీడీపీనే గెలిపించమని కోరుకుంటున్నాను. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఓటేసేటప్పుడు గుర్తు చేసుకోవాల్సింది నన్నే తప్ప మరొకరిని కాదు.

మరో ముఖ్యమైన విషయం, వ్యక్తులు శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదు. ఈ రాష్ట్రం శాశ్వతం, మనం నిర్మిస్తున్న రాజధాని, పోలవరం శాశ్వతం. ఇక్కడి ప్రజానీకం శాశ్వతం, వాళ్ల సుఖశాంతులు శాశ్వతం. అలాంటి రాష్ట్రం కోసం మరోసారి అందరినీ వేడుకుంటున్నా. ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, అన్ని నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని అనుకుని ఓటేయండి. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఎన్నికల సందర్భంగా మీ అందరికీ అభినందనలు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సాగిస్తున్న ఈ ధర్మపోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆకాంక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను" అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు.

  • Loading...

More Telugu News