Chandrababu: మోదీ ఆధ్వర్యంలో ఈసీ పనిచేస్తోందని 66 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇవాళ రాష్ట్రపతికి ఫిర్యాదుచేశారు: చంద్రబాబు
- సత్తెనపల్లెలో రోడ్ షో
- మోదీపై విసుర్లు
- జగన్, కేసీఆర్ పైనా విమర్శలు
ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లెలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోజు మనది కోడికత్తిపై పోరాటం కాదని, కేసీఆర్ పైనా, మోదీపైనా పోరాటం అని స్పష్టం చేశారు. జగన్, కేసీఆర్, మోదీ ముగ్గురినీ కట్టకట్టి బంగాళాఖాతంలో పారేయాలని పిలుపునిచ్చారు.
"మనకి అన్యాయం జరిగిందా? లేదా?. మోదీ న్యాయం చేశాడా? నమ్మకద్రోహం జరిగిందా? లేదా? వెంకన్నను కూడా మోసం చేసిన వ్యక్తి మోదీ. ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేశాడు. ఈ రోజు 66 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఎన్నికల సంఘం మోదీ ఆధ్వర్యంలో పనిచేస్తోందని ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. రాష్ట్రపతి గారూ మీరు జోక్యం చేసుకోండి, ఈసీకి స్వయంప్రతిపత్తి లేదు, ఇది దేశానికి మంచిది కాదని ఫిర్యాదు చేశారంటే ఇది మోదీ అన్యాయ పాలనకు పరాకాష్ట తప్ప మరోటి కాదు.
నేను సంవత్సరం నుంచి పోరాడుతున్నా. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఆర్బీఐని కుప్పకూల్చారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా ఉపయోగించుకుని మనపై దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమరపాటుగా ఉంటే ఇవే మనకు చివరి ఎన్నికలు అవుతాయి" అంటూ ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.