assam: బీఫ్ అమ్ముతున్న ముస్లిం వ్యక్తికి పంది మాంసం తినిపించిన వైనం
- అసోంలో ముస్లిం వ్యక్తిని చితకబాదిన స్థానికులు
- వెళ్లనివ్వాలంటూ వేడుకుంటున్నా కనికరించని వైనం
- బంగ్లాదేశీ పౌరుడివా? అంటూ ప్రశ్న
బీఫ్ (గొడ్డు మాంసం) అమ్ముతున్న ఒక ముస్లింపై కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. అతని చేత బలవంతంగా పంది మాంసాన్ని తినిపించారు. మతాచారాల ప్రకారం పందిని తినడం కానీ, ముట్టుకోవడం కానీ ముస్లింలు చేయరనే సంగతి తెలిసిందే. అసోంలోని బిశ్వనాథ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బీఫ్ అమ్ముతున్న షౌకత్ అలీ (68)ని స్థానికులు రోడ్డుపైనే చితకబాదారు. మోకాళ్ల మీద కూర్చొని తనను వెళ్లనివ్వాలంటూ అతను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నారు.
షౌకత్ అలీపై దాడి చేసేముందు... బీఫ్ ను అమ్మడానికి లైసెన్స్ ఉందా? అని దాడికి పాల్పడ్డ వ్యక్తులు ప్రశ్నించారు. జాతీయ పౌర రిజిస్టర్ లో నీ పేరు ఉందా? అని నిలదీశారు. నువ్వు బంగ్లాదేశీవా? అంటూ మరికొందరు ప్రశ్నించారు.