Andhra Pradesh: నీళ్లు పట్టుకునే ఆడబిడ్డలపై వేట కొడవలితో దాడి చేస్తారా?: వైసీపీ నేతలపై చంద్రబాబు నిప్పులు
- టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలి
- జగన్, మోదీలో ఓటమి భయం పట్టుకుంది
- టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఎన్నికల యుద్ధానికి ఇంకా రెండ్రోజులే ఉందనీ, టీడీపీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం, త్యాగానికి తగిన గుర్తింపు ఉంటుందని ఏపీ సీఎం హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల భద్రతను తన బాధ్యతగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో ఎలక్షన్ మిషన్-2019పై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరు బాగుందని 68-76 శాతం ప్రజలు చెప్పారని తెలిపారు. అన్ని సర్వేలు టీడీపీ గెలుపును నిర్ధారిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంల పనితీరు, ఓటింగ్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. ఓటమి భయంతో మోదీ, జగన్ లో అసహనం పెరిగిపోయిందని చంద్రబాబు విమర్శించారు.
‘నీళ్లకు ఓ పార్టీ ఉంటుందా? వైసీపీ నీళ్లు.. టీడీపీ నీళ్లు అని ఉంటాయా? నీళ్లు పట్టుకునే ఆడబిడ్డలపై కనికరం లేకుండా వేట కొడవలితో దాడి చేస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు నరరూప రాక్షసులుగా మారారని దుయ్యబట్టారు. వైసీపీకి ఓటేస్తే జనాలను బతకనిస్తారా? ఆస్తులను ఉండనిస్తారా? అని అడిగారు.