Kurnool District: స్ట్రెచర్‌పై పడుకుని ప్రచారం చేస్తున్న మంత్రాలయం టీడీపీ అభ్యర్థి

  • కాలికి బుల్లెట్‌ గాయంతో కొన్నాళ్లుగా బెడ్‌రెస్ట్‌
  • ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో తిరగక తప్పని పరిస్థితి
  • భార్యతో కలిసి రోడ్డు షోలు నిర్వహణ

ఓ వైపు పోలింగ్‌ సమయం దగ్గరపడింది, మరోవైపు అనారోగ్యం కారణంగా మంచంపై నుంచి లేవలేని పరిస్థితి, దీంతో స్ట్రెచర్‌పై పడుకునే తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి. కాలికి గాయం కావడంతో తిరగలేని పరిస్థితుల్లో ఆయనకు ఈ అవస్థలు తప్పడం లేదు.

ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తిక్కారెడ్డి నామినేషన్ కు ముందే సైకిల్‌ యాత్ర, ర్యాలీలు, సభలతో కొన్ని గ్రామాలను చుట్టేశారు. ఇందులో భాగంగా మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా ఘర్షణ చెలరేగడంతో తిక్కారెడ్డి వ్యక్తిగత గన్‌మెన్‌ గుంపును చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈ సందర్భంలో మిస్‌ఫైర్‌ అయి ఓ బుల్లెట్‌ తిక్కారెడ్డి కాలిలోకి చొచ్చుకుపోయి తీవ్రగాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం స్ట్రెచర్‌పైనే వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం భార్య వెంకటేశ్వరమ్మ సహకారంతో ప్రత్యేక అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై పడుకుని రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులు తన భర్తను కాలుకదపకుండా చేశారని, అందువల్లే ఈ పరిస్థితి అని, తన భర్తకు ఓటేసి ప్రత్యర్థులకు బుద్ధి చెప్పాలని ఆమె కోరుతున్నారు.

Kurnool District
mantralayam
Telugudesam
candiate campaign
  • Loading...

More Telugu News