Chandrababu: భద్రాద్రి రాముడు మళ్లీ తూర్పుగోదావరి జిల్లాకే వస్తాడు, కాపాడుకుంటాం: కాకినాడ రోడ్ షోలో చంద్రబాబు వ్యాఖ్యలు
- భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాదే
- 60 ఏళ్ల క్రితం మన జిల్లాలోనే ఉంది
- మాకు ఇచ్చేస్తే తీసుకుంటాం
పోలవరం కడితే భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నాడని, అసలు భద్రాచలం తమదేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పోలవరం కట్టొద్దంటూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాడని, అసలు మీకేం అర్హత ఉందని సుప్రీంకోర్టుకు వెళ్లారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"భద్రాచలం మునిగిపోతుందని చెబుతున్నారు! భద్రాచలం మన ఈస్ట్ గోదావరిదే. 60 ఏళ్ల క్రితం మన జిల్లాలోనే ఉంది. అవసరమైతే భద్రాచలం మాకే ఇవ్వండి. మళ్లీ రాముడు ఈస్ట్ గోదావరి జిల్లాకే వస్తాడు, మా దేవుడ్ని మేం కాపాడుకుంటాం" అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, నాగార్జునసాగర్, శ్రీశైలం తనకే కావాలని కేసీఆర్ అంటున్నాడని, రాయలసీమకు నీళ్లివ్వడానికి వీల్లేదంటున్నాడని మండిపడ్డారు.
కోడికత్తి పార్టీకి రోషం లేదని, పులివెందులకు నీళ్లు ఇవ్వబోమని కేసీఆర్ అంటున్నా ఊడిగం చేయడానికి సిద్ధపడిపోయాడని విమర్శించారు. కానీ, తాను పులివెందులతో పాటు రాయలసీమకు నీళ్లిచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.