Chandrababu: బాగా దొరికాడు, వస్తాడేమో తేల్చుకుందాం అని చూశా... కానీ రాలేదు: కాకినాడ రోడ్ షోలో చంద్రబాబు ఫైర్
- కేసీఆర్ పై ధ్వజం
- అంత లెక్కలేనితనమా!
- కట్టకట్టి సముద్రంలో పారేస్తా!
ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాకినాడ రూరల్ ఏరియాలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా ప్రత్యర్థులపై దాడికి ఉపక్రమించారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలుగుతల్లిని అవమానించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ట్యాంక్ బండ్ పై విగ్రహాలు కూల్చివేశారని, విగ్రహాలు ఏం తప్పుచేశాయని చంద్రబాబు ప్రశ్నించారు.
"మనమంటే అంత లెక్కలేని తనమా! హైదరాబాద్ ను ఎవరు డెవలప్ చేశారు? సైబరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? ఎయిర్ పోర్టు ఎవరు కట్టారు? అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు తీసుకొచ్చారు? ఎవరి కోసం చేశాను? మనవాళ్ల కోసం చేశాను. నన్ను తిట్టినా పడతాను, కానీ మన ఆంధ్రుల్ని తిడితే మాత్రం సహించను. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట! నేనూ అనుకున్నాను, బాగా దొరికాడు వస్తాడేమో చూసుకుందామనుకున్నా. కానీ రాలేదు, పారిపోయాడు. కేసీఆర్, మోదీ, జగన్ లను చాపలో చుట్టి సముద్రంలో పారేస్తా!" అంటూ తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యానించారు.
ప్రజలకు నీతివంతమైన పాలన అందించడం కోసం కష్టపడుతుంటే, జగన్ మాత్రం కేసీఆర్ వద్ద ఊడిగం చేసుకుని వెయ్యి కోట్లు తెచ్చుకుంటున్నాడని ఆరోపించారు. వెయ్యి కోట్ల కోసం లక్ష కోట్లు ఎగ్గొడతారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.