Chandrababu: సొంత చెల్లెల్నే చూడని చంద్రబాబు ఏపీలో చెల్లెమ్మలను ఎలా చూసుకుంటారు?: జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే
- పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం
- చంద్రబాబుపై విమర్శలు
- లోకేష్ గురించి ప్రస్తావన
ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ కార్యాలయంలో నార్నే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సొంత సోదరికి తిరుపతిలో ప్రమాదం సంభవిస్తే ఇంతవరకు ఆమెను పరామర్శించలేదంటే చంద్రబాబు ఎలాంటివాడో అర్థమవుతుందని అన్నారు. సొంత చెల్లెల్నే సరిగా చూసుకోలేని చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న చెల్లెమ్మలను ఎలా చూసుకుంటారని మండిపడ్డారు.
సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడి పరిస్థితి దిగజారిపోవడానికి చంద్రబాబే కారణమని, చంద్రగిరిలో తనకంటే తమ్ముడికే పాప్యులారిటీ ఉండడం చూసి తన మకాం కుప్పం నియోజకవర్గానికి మార్చుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో నారా లోకేష్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. నారా లోకేష్ టెన్త్ ఎలా పాసయ్యాడో తనకు తెలుసని అన్నారు. లోకేష్ పదో తరగతిలో ఉత్తీర్ణుడు అయ్యేందుకు మంత్రి నారాయణ సహకరించాడని ఆరోపించారు. నారాయణ ఎలాంటి సాయం అందించాడో కూడా తనకు తెలుసని, చంద్రబాబునాయుడు ఇప్పటికీ మంత్రి నారాయణకు చాలా ముట్టచెబుతుంటాడని ఆరోపించారు.
చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చాడు కాబట్టే ఇప్పుడు టీడీపీని కూడా కాంగ్రెస్ కే తాకట్టు పెట్టాడని విమర్శించారు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని నార్నే అన్నారు.