Tamilnadu: కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. తమిళనాడు మాజీ ఎమ్మెల్యే సహా ముగ్గురి దుర్మరణం!

  • తమిళనాడులోని ఆంబూరులో ఘటన
  • ఆసుపత్రికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే సుందరవేల్
  • వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పడంతో దుర్ఘటన

ఓ డ్రైవర్ నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో కారు అదుపుతప్పి లారీ కిందకే దూసుకుపోవడంతో కారులోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈ ఘటన తమిళనాడులోని ఆంబూరులో చోటుచేసుకుంది.

వేలూరు జిల్లా తిరుపత్తూరు మాజీ ఎమ్మెల్యే సుందరవేల్‌(71) ఆయన భార్య విజయలక్ష్మి(65) ఈరోజు చెన్నైలోని ఓ ఆసుపత్రికి చికిత్స కోసం బయలుదేరారు. మార్గమధ్యంలో ఆంబూరు వద్ద ఉదయం 6 గంటల సమయంలో ముందు వెళుతున్న కంటైనర్ లారీని ఓవర్ టేక్ చేసేందుకు డ్రైవర్ వీరమణి ప్రయత్నించాడు. అయితే కారు ఒక్కసారిగా అదుపుతప్పి లారీ వెనుకభాగాన్ని ఢీకొట్టింది. ఈ సందర్భంగా లారీ వెనుకచక్రాల దగ్గర కారు ఇరుక్కుంది.

ఇది గమనించని కంటైనర్ లారీ డ్రైవర్.. సదరు కారును 25 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లాడు.ఈ సందర్భంగా పెద్ద శబ్దం రావడంతో లారీని ఆపిచూడగా, కారు లారీ కింద ఇరుక్కుపోయింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన డ్రైవర్, పోలీస్ స్టేషన్ కు వెళ్లి స్వచ్ఛందంగా లొంగిపోయాడు.

కాగా, ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే సుందరవేల్, ఆయన భార్య విజయలక్ష్మీ తో పాటు డ్రైవర్ వీరమణి అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను అధికారులు 2 గంటల పాటు కష్టపడి బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సుందరవేల్ ప్రస్తుతం అన్నాడీఎంకే అముముక పట్టణం కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tamilnadu
Road Accident
Police
anna dmk
ex mla
chennai
  • Loading...

More Telugu News