Chandrababu: ఉద్యోగులందరినీ తీసేసి దోపిడీ చేయడానికి నీ కార్యకర్తలను పెట్టుకుంటావా?: జగన్ పై చంద్రబాబు ఫైర్
- మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ అధినేత
- జగన్ పై విసుర్లు
- అమలు చేయగలిగినవే చెప్పాం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోను మీడియాకు వెల్లడించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, చేయదగ్గ పనులే టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విపక్షనేత జగన్ కు చురకలంటించారు. అధికారంలోకి వస్తే పంచాయతీల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి పది మందికి ఉద్యోగాలిస్తానని చెబుతున్నాడని, అదే జరిగితే, అనేకమంది ఉద్యోగులను తొలగిస్తాడని అన్నారు.
"పంచాయతీ కార్యదర్శిని తీసేస్తాడు, వీఏఓను తీసేస్తాడు, లేకపోతే వీఆర్ఓను తీసేస్తాడు, ఎంపీవోను తీసేస్తాడు, అంగన్ వాడీలను తీసేస్తాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ను తీసేస్తాడు" అంటూ ఆరోపించారు. "వాళ్లందరినీ తీసేసి నీ కార్యర్తలను పెట్టుకుంటావా దోపిడీ చేయడానికి?" అంటూ మండిపడ్డారు. గ్రామాల్లో తగినంత మంది ఉద్యోగులు ఉన్నారని, అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చామని, సమర్థంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.