Andhra Pradesh: కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా క్షమించేశాను!: వైసీపీ అధినేత జగన్
- నాకు వారిపై ఇప్పుడు ద్వేషం లేదు
- ఏపీకి హోదానే మా తొలి ప్రాధాన్యత
- జాతీయ మీడియాతో వైసీపీ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీని తాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాననీ, వారిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని జగన్ స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేేశ్ కు ప్రత్యేకహోదానే తమ తొలి ప్రాధాన్యమని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తాము మద్దతు ఇస్తామని జగన్ తెలిపారు.
మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేశారని జగన్ విమర్శించారు. అందువల్లే వీరిద్దరినీ నమ్మే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాను దేవుడిని నమ్ముతాననీ, ప్రతీకారం అన్న విషయాన్ని ఆ దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం 2010లో జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం వైసీపీని స్థాపించారు.