Chandrababu: నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో!: కంచరపాలెం రోడ్ షోలో చంద్రబాబు వ్యాఖ్యలు
- మోదీ లాంటి దుర్మార్గుడు మరొకరు లేరు
- వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు
- అరెస్ట్ లకు భయపడేది లేదు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం కంచరపాలెంలో రోడ్ షో నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే రాష్ట్ర సీఎస్ పునేఠా బదిలీకి సంబంధించిన సమాచారం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అంటూ సందేహం వెలిబుచ్చారు.
తాను దేనికీ భయపడబోనని, అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. నేరస్తులను తాను ఏనాడూ ప్రోత్సహించలేదని, మతకలహాలను, తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కిపెట్టానని అన్నారు. తనపై బాంబులు వేసినా భయపడలేదని, ఇప్పుడు ఏకాకిని చేసి దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ అభ్యర్థులపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని, అవసరమైతే తాను కూడా జైలుకెళ్తానని, దేనికీ వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ, ఆర్బీఐ వంటి వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడంటూ ప్రధాని మోదీపై మండిపడ్డారు. మోదీ లాంటి దుర్మార్గుడు మరొకరు లేరని విమర్శించారు.