YSRCP: ఏడాదిన్నర క్రితం వీడియోతో నారాయణ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు: అనిల్ కుమార్ యాదవ్ మండిపాటు
- చంపడమా? చావడమా? అని కార్యకర్తల సమావేశంలో అన్నాను
- ఆ వీడియోని మార్ఫింగ్ చేసి ఇప్పుడు తీసుకొచ్చారు
- నారాయణది ఓటమి భయం
మునుపెన్నడూ లేని విధంగా నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే స్థానంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మంత్రి నారాయణ స్వయంగా పోటీచేస్తుండడంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దూకుడు, ప్రజలతో పాటు మీడియాను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే, కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో అనిల్ కుమార్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎన్నికల్లో మనముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి, చంపడమా? లేక, చావడమా? అంటూ కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఆవేశంతో అనిల్ కుమార్ ప్రసంగిస్తుండడం ఆ వీడియోలో ఉంది. దీన్ని టీడీపీ నేతలు సీరియస్ గా పరిగణించి ఈసీకి ఫిర్యాదు చేశారు.
అయితే, తాను ఆ వ్యాఖ్యలు చేసింది ఏడాదిన్నర క్రితం అయితే, ఇప్పుడా వీడియోను మార్ఫింగ్ చేసి తెరపైకి తెచ్చారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఓటమిభయంతో మంత్రి నారాయణ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త ఎన్నికల్లో ఓ సైనికుడిలా పోరాడాలని చెప్పే క్రమంలో చంపడమా? చావడమా? అంటూ వ్యాఖ్యలు చేశానని, అది ఎవరినీ ఉద్దేశించింది కాదని స్పష్టం చేశారు. నీచ రాజకీయాలు చేయకుండా దమ్ముంటే తనతో నేరుగా పోరాడాలంటూ అనిల్ కుమార్ మంత్రి నారాయణకు సవాల్ విసిరారు.