mohanlal: వేయికోట్ల 'మహాభారతం' ఇప్పట్లో లేనట్టే!
- దర్శకుడితో మనస్పర్ధలు వచ్చాయన్న బీఆర్ శెట్టి
- తప్పకుండా ఈ సినిమాను నిర్మించి తీరుతాను
- నిరాశకి లోనైన మోహన్ లాల్ అభిమానులు
ప్రముఖ రచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ రాసిన 'రాండ మూజమ్' నవల ఆధారంగా, 'మహాభారతం' సినిమాను నిర్మించాలని పారిశ్రామికవేత్త బీఆర్ శెట్టి భావించారు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన దర్శకుడిగా శ్రీకుమార్ మీనన్ ను ఎంపిక చేసుకున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో వివిధ భాషల్లో ఈ సినిమాను రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు. బౌండ్ స్క్రిప్ట్ కూడా సిద్ధమైపోయింది. భీముడి పాత్ర కోసం మోహన్ లాల్ ను తీసుకున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది.
కానీ ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు లేదనేది తాజా సమాచారం. దర్శక నిర్మాతల మధ్య వచ్చిన మనస్పర్ధలే అందుకు కారణమని తెలుస్తోంది. తాజాగా బీఆర్ శెట్టి స్పందిస్తూ .. "శ్రీకుమార్ మీనన్ తో విభేదాలు తలెత్తాయి. మంచి రచయిత .. దర్శకుల కోసం అన్వేషణ సాగుతోంది. ఆలస్యమైనా ఈ సినిమాను తప్పకుండా నిర్మించి తీరుతాను" అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతున్నందుకు మోహన్ లాల్ అభిమానులు నిరాశకి లోనవుతున్నారు