Andhra Pradesh: 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి అందుకే మద్దతు ఇచ్చా!: పవన్ కల్యాణ్
- దళిత నేతలు, మేధావులతో సాన్నిహిత్యం ఉంది
- తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్నాం
- విశాఖలో పవన్ కల్యాణ్, మాయావతి సంయుక్త సమావేశం
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో కలిసి పనిచేయాలని 2008 నుంచి తనకు ఆహ్వానాలు అందాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కలిసి ముందుకు వెళ్లలేకపోయానని వ్యాఖ్యానించారు.
బీఎస్పీ మేధావులు, దళిత నేతలతో తన సాన్నిహిత్యం కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీతో కలిసి తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు. విశాఖలో ఈరోజు బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
2014 ఎన్నికల సందర్భంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. మాయావతిని భారత ప్రధానిగా చూడాలనుకుంటున్నామని పేర్కొన్నారు. దేశానికి ఓ చాయ్ వాలా, చౌకీదార్ ప్రధానమంత్రి అయ్యారనీ, ఇప్పుడు ఓ ఫైటర్, ఒంటరి మహిళ ప్రధాని కాబోతున్నారని వ్యాఖ్యానించారు.