Bjp: చంద్రబాబును అడ్డుకోవడమే ఈ మూడు పార్టీల కామన్ అజెండా: ఎంపీ కనకమేడల ధ్వజం
- ‘బాబుది అవినీతి ప్రభుత్వం’ అన్న దుష్ప్రచారం తగదు
- చంద్రబాబు ఏకపక్షంగా గెలుస్తారని తెలిసి కుట్రలు
- హామీలను నెరవేర్చమంటే టీడీపీని లక్ష్యంగా చేసుకుంటారా?
చంద్రబాబును అడ్డుకోవడమే బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల కామన్ అజెండా అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మూడు పార్టీలు ‘చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం’ అని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు ఏకపక్షంగా గెలుస్తారని తెలిసి, అలా జరగకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఈ కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే నిన్న రాజమహేంద్రవరంలో మోదీ సభ అని విమర్శించారు. 2014లో మోదీ ఏం చెప్పారు? ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అని ప్రశ్నించారు. 2014లో ఎన్నికలకు ముందు మోదీ-బాబు జోడీ ఏపీని అభివృద్ధి చేస్తుందని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని నాడు మోదీ చెప్పిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. విభజన చట్టం హామీలను నెరవేర్చని మోదీపై చంద్రబాబు ఎప్పుడైతే విమర్శలు చేశారో అప్పటి నుంచి టీడీపీని, తమ పార్టీ అధినేత చంద్రబాబును, నేతలను మోదీ లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్ట్ వ్యయం ఎంత, కేంద్రం ఇచ్చింది ఎంత? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు బాగా కడుతున్నారని పార్లమెంట్ లో బీజేపీ ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాజెక్ట్ కు రూ.7000 కోట్లు ఇచ్చామని మోదీ చెప్పడంపై ఆయన విమర్శలు చేశారు.