Chandrababu: జగన్ దగ్గరికి సినీ నటులు క్యూ కట్టిన కారణమిదే: చంద్రబాబు
- ఆస్తులు ఆక్రమిస్తామని టీఆర్ఎస్ బెదిరింపులు
- కేసీఆర్ కారణంగానే జగన్ వద్దకు నటీనటులు
- ఆస్తులు కాపాడుకోవడం కోసం అయిష్టంగా చేరుతున్నారు
- కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపుల కారణంగానే పలువురు సినీనటులు వైఎస్ జగన్ వద్దకు క్యూ కట్టారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీలో చేరకుంటే వారి ఆస్తులను ఆక్రమిస్తామని బెదిరిస్తున్నారని, హైదరాబాద్ నగరంలోని తమతమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే నటీనటులు అయిష్టంగా వైకాపా కండువాలు కప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఒక్కసారే కదా అని తినే అన్నంలో విషం కలుపుకుని తింటామా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ ఉదయం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఆడపడుచులకు అందిస్తున్న 'పసుపు - కుంకుమ' ఆపాలని వైకాపా నేతలు హైకోర్టును ఆశ్రయించడంపై మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే డబ్బులు ఆగరాదుగానీ రాష్ట్రం ఇచ్చే డబ్బులు మాత్రం ఆపాలా? అని ప్రశ్నించారు. అద్దె మనుషులు, వలస పక్షులు కోడికత్తి పార్టీకి మద్దతుగా ప్రచారానికి వస్తున్నారని, వీరంతా ఎలక్షన్స్ ముగియగానే హైదరాబాద్ చెక్కేస్తారని అన్నారు.
నిన్న తాను పులివెందులలో పర్యటిస్తే, ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని వ్యాఖ్యానించిన చంద్రబాబు, అన్ని ప్రాంతాల్లో టీడీపీపై సానుకూలత కనిపిస్తోందని, వైసీపీపై ఎంతో వ్యతిరేకత ఉందని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ వేసిన నిందలతో రాష్ట్ర ప్రజల్లో రోషం పెరగాలని, మరింత పట్టుదలతో టీడీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఏపీకి హోదాను ఇస్తే, తమకు కూడా ఇవ్వాలన్న కేసీఆర్ తో జగన్ ఎందుకు కలిసి పనిచేస్తున్నారో ప్రజలకు తెలియజెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.