Yogi Adityanath: మహ్మద్ అఖ్‌లక్‌ను కొట్టి చంపిన నిందితుడు యోగి సభలో ప్రత్యక్షం.. కేరింతలతో హల్‌చల్
- గోవును చంపాడంటూ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన విశాల్ రాణా బృందం
- అప్పటి నుంచి కనిపించకుండా పోయిన వైనం
- తాజాగా యోగి సభలో కనిపించిన వైనం
దాద్రి లించింగ్ (దాద్రిలో కొట్టి చంపిన) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సభలో కనిపించి హల్‌చల్ చేశారు. యోగి ప్రసంగానికి కేరింతలు కొడుతూ చేతులూపుతూ అందరినీ ఆకర్షించారు. గ్రేటర్ నోయిడాలోని బిసాడా గ్రామంలో యోగి ర్యాలీలో వీరు కనిపించారు.
కొన్నాళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో గోవును చంపాడని ఆరోపిస్తూ మొహమ్మద్ అఖ్‌లక్ అనే వ్యక్తిని అతడి కుటుంబ సభ్యుల కళ్లెదుటే అత్యంత దారుణంగా కొట్టి చంపారు. అప్పట్లో ఈ ఘటన దేశ్యాప్తంగా సంచలనమైంది. విశాల్ రాణా, అతడి బృందం కలిసి ఈ ఘటను పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అఖ్‌లక్‌ను కొట్టిచంపిన విశాల్ రాణా బృందం అతడి కుమారుడు డేనిష్‌ను కూడా వదల్లేదు. అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయితే, అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయిన విశాల్ రాణాతోపాట మరో ముగ్గురు మళ్లీ ఇప్పుడు యోగి సభలో కనిపించడం చర్చనీయాంశమైంది.