F16: బుకాయిస్తూ వచ్చిన పాక్... నిజం ఒప్పేసుకుంది!
- ఎఫ్-16 విమానాలు వాడలేదని చెప్పిన పాక్
- అమెరికా ఒత్తిడి పెరగడంతో నిజం ఒప్పుకోలు
- తమ భూభాగం నుంచే దాడులన్న ఆసిఫ్ గఫూర్
బాలాకోట్ పై దాడి తరువాత అమెరికా తమకు విక్రయించిన ఎఫ్-16 విమానాలను వాడలేదని నిన్నటివరకూ బుకాయిస్తూ వచ్చిన పాకిస్థాన్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పేసుకుంది. ఈ విమానాలను ఉగ్రవాద నిరోధానికి తప్ప, మరో దేశంపై ప్రయోగించరాదన్న ఒప్పందాన్ని పాకిస్థాన్ మీరిందంటూ, సాక్ష్యాధారాలను అమెరికాకు భారత్ అప్పగించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో, తమ ఎఫ్-16 యుద్ధ విమానాలే భారత మిగ్ ను కూల్చేశాయని పాక్ సైన్యాధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ నిజాన్ని అంగీకరించారు. ఈ మేరకు ఓ ప్రకటనను ఆయన విడుదల చేశారు. ఫిబ్రవరి 27న ఎల్ఓసీ వెంబడి, తమ గగనతలం నుంచే దాడులు చేయాల్సి వచ్చిందని, తాము మోహరించిన విమానాల్లో ఎఫ్-16 విమానాలు కూడా ఉన్నాయని, భారత విమానాలు తమ భూభాగంలోకి ప్రవేశించిన తరువాత, రెండు విమానాలను కూల్చేశామని అన్నారు. కాగా, గత నెలలో ఇదే గఫూర్ తాము ఎఫ్-16లను వాడలేదని జేఎఫ్-17 మోడల్ ఫైటర్లను వాడామని చెప్పిన సంగతి తెలిసిందే.