Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై చెప్పులు.. ఎన్నికల ప్రచారంలో కలకలం
- తంజావూరులో ప్రచారం చేస్తుండగా ఘటన
- సీఎం ప్రచారంలో భద్రతా సిబ్బంది లోపం
- దుండగుడిని ఇప్పటి వరకు గుర్తించలేకపోయిన పోలీసులు
తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలో తంజావూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పులు విసిరాడు. దీంతో ప్రచారంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
భద్రతా పర్యవేక్షణ సరిగా లేకపోవడం, సిబ్బంది కొరవడడం వల్లే ఈ ఘటన జరిగినట్టుగా అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. సీఎంపైకి చెప్పులు విసిరిన వ్యక్తిని ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేదు. ముఖ్యమంత్రుల పైకి చెప్పులు విసరడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలోకి చొరబడిన ఓ వ్యక్తి ఆయనపై ఇంకుతో చేసిన దాడి అప్పట్లో సంచలనం సృష్టించాడు.