Jagan: వైసీపీని 25 స్థానాల్లో గెలిపిస్తే ప్రత్యేక హోదాను ఆపడం ఎవరి తరం కాదు: జగన్

  • బాబు దిగిపోతేనే ఉద్యోగాలు
  • అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ
  • గ్రామానికో సచివాలయం

నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలంటే బాబు సీఎం పదవి నుంచి తొలగిపోవాలని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్ షో‌లో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తన కొడుకు లోకేశ్‌కు మాత్రమే రెండు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప, ఉద్యోగాల భర్తీ అనేదే జరగలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావడం తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని, 25 ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే, తెలంగాణ నుంచి 17 ఎంపీలు తోడైతే కేంద్రంలో హోదాను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీతో పాటు పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలిచ్చే విధంగా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి ఓ సచివాలయం ఏర్పాటు చేసి, వాటిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. బాబు సీఎం పదవి నుంచి దిగిపోతేనే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలొస్తాయన్నారు.  

Jagan
Chandrababu
YSRCP
Telangana
Jobs
Special Status
  • Loading...

More Telugu News