Pawan Kalyan: మీలో నలుగురు వచ్చి నా శవాన్ని మోసే వరకు నేను జనసేనను మోయగలను: పవన్ కల్యాణ్
- తణుకులో జనసేనాని విసుర్లు
- జగన్, చంద్రబాబులపై విమర్శలు
- పనికిమాలిన దుష్ప్రచారాలు అంటూ ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాల్లో తీవ్రత పెంచారు. తాజాగా తణుకు శంఖారావం సభలో మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీలను టార్గెట్ చేశారు. టీడీపీ, వైసీపీలతో కలవాల్సిన దుస్థితిలో జనసేన పార్టీ లేదని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ఉభయగోదావరి జిల్లాల తెలుగుదేశం నేతలకు మర్యాద దక్కదని పవన్ హెచ్చరించారు. అయినా, సైకిల్ చైన్ ఎప్పుడో తెంపేశామని, ఇంకా ఆ పార్టీ నాయకులు పనికిమాలిన ప్రచారాలు చేయడంలో అర్థంలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని, అందుకే చంద్రబాబునాయుడు గారికి పెన్షన్ ఇచ్చి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని సూచించారు.
తాను సుదీర్ఘ ప్రణాళికతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఎన్నికలతోనే అంతా అయిపోతుందని భావించడంలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత జైలుకు వెళ్లడానికి తనపై జగన్ లా అక్రమాస్తుల కేసులు లేవని, చంద్రబాబులా ఓటుకు నోటు కేసు లేదని సెటైర్ వేశారు. ఇతర పార్టీల నేతల్లా కాకుండా, నలుగురు మనుషులు వచ్చి తన శవాన్ని మోసే వరకు తాను జనసేన పార్టీని మోయగలనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.