Mohanbabu: చంద్రబాబు నూరేళ్లూ బతకాలని కోరుకుంటున్నాను... కానీ..: మోహన్ బాబు
- సీఎం పదవికి మాత్రం తగడు
- జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం
- హామీలన్నీ నెరవేరుస్తారన్న మోహన్ బాబు
ఎంత దుర్మార్గుడైనా, చంద్రబాబు మరణించాలని తాను కోరుకోవడం లేదని, ఆయన నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. కానీ, ఆయన ముఖ్యమంత్రి పదవికి తగడని, అబద్ధాలు చెప్పే, మోసాలు చేసే వ్యక్తిని ప్రజలు ఎన్నుకోరాదని సలహా ఇచ్చారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ ను సీఎం చేయాలని కోరారు. 3,600 కిలోమీటర్లకు పైగా నడిచిన ఏకైక రాజకీయ నాయకుడిగా ఉన్న జగన్, తానిచ్చిన నవరత్నాల హామీలను నిలబెట్టుకుంటాడన్న నమ్మకం తనకుందని అన్నారు. జగన్ నిక్కచ్చిగా ఉండే మనిషని, ఆయన సీఎం కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు.
రాజధానిని ఏదైనా బీడు భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కట్టివుంటే ఎంతో మేలు జరిగుండేదని, కానీ, పచ్చని పొలాల్లో ముందే బినామీల ద్వారా కొనుగోలు చేయించి, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి రైతులను మోసం చేశారని మోహన్ బాబు ఆరోపించారు. నిత్యమూ జగన్ ను దొంగ, దొంగ అని ఆరోపించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుపై 11 కేసులు ఉన్నాయని, వాటిల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకుని తిరుగుతున్నారని నిప్పులు చెరిగారు. ఎవరిని మోసం చేసి చంద్రబాబు ఇంత ఆస్తి సంపాదించారని మోహన్ బాబు ప్రశ్నించారు.