Cricket: బ్యాటింగ్ వీరులున్నా నీరసపడిపోయారు!... చాలెంజర్స్ చెత్త ఆట... దుమ్మురేపిన సన్ రైజర్స్
- 113 పరుగులకే ఆలౌటైన బెంగళూరు
- విఫలమైన కోహ్లీ, డివిలియర్స్
- 118 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘనవిజయం
సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరోసారి రెచ్చిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి 118 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి హేమాహేమీలు ఉన్నా బెంగళూరు జట్టు చిత్తుగా ఓడిపోయింది. కోహ్లీ 3 పరుగులు చేయగా, డివిలియర్స్ 1 పరుగుతో సరిపెట్టుకున్నాడు. లోయర్ ఆర్డర్ లో గ్రాండ్ హోమ్ 37 పరుగులు చేయడంతో బెంగళూరు స్కోరు కనీసం 100 పరుగులైనా దాటింది. ఓ దశలో 35 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా చివరి వరుస బ్యాట్స్ మెన్ పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. మొత్తమ్మీద 232 పరుగుల భారీ లక్ష్యఛేదనలో దారుణమైన రీతిలో 113 పరుగులకే కుప్పకూలింది.
సన్ రైజర్స్ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ నబీ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. నబీ కారణంగానే బెంగళూరు టాపార్డర్ కకావికలం అయింది. నబీకి తోడు పేసర్ సందీప్ శర్మ (3) కూడా విజృంభించడంతో సన్ రైజర్స్ విజయం నల్లేరుపై నడకే అయింది. దానికితోడు సన్ రైజర్స్ ఫీల్డర్లు మైదానంలో మెరుపులా స్పందించి రనౌట్లు కూడా చేశారు. అంతకుముందు జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ సెంచరీలు చేయడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 231 పరుగుల చేయడం తెలిసిందే.