visakhapatnam: ఎన్నికల నిబంధనల పేరుతో దేవుడి విగ్రహానికే ముసుగేశారు!

  • విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలంలో ఘటన
  • కృష్ణుని విగ్రహం ముఖానికి ముసుగు కప్పిన సిబ్బంది
  • అదేం అంటే ఎన్టీఆర్‌ పోలికలు ఉన్నాయంటూ వివరణ

ఎన్నిక వేళ ఓటర్లను ప్రభావితం చేసే అంశాలేమైనా ఉంటే వాటిని తొలగించడం ఎన్నికల నిబంధన. ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖుల విగ్రహాల ముఖాలకు ముసుగులు తొడుగుతారు. అంతవరకు బాగానే ఉన్నా విశాఖ ఎన్నికల అధికారులు ఏకంగా దేవుడి విగ్రహానికే ముసుగువేసి ఆశ్చర్యపరిచారు. అదేం అంటే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పోలికలున్నాయని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే... రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, కర్ణుడు... ఇలా పౌరాణిక పాత్రల పెద్దన్నగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్‌ తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయులు. దేవుళ్లు ఎలా ఉంటారో తెలియదుగాని ఎన్టీఆర్‌ ఆ వేషం వేస్తే అచ్చం అలాగే ఉంటారనుకునే వారు ఆయన అభిమానులు. సరిగ్గా ఇటువంటి అనుమానమే విశాఖ ఎన్నికల అధికారులకు వచ్చినట్టుంది.

విశాఖ నగరం పెదగంట్యాడ పరిధి సీతానగరం ఉక్కు నిర్వాసిత కాలనీ కూడలిలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ముఖానికి ముసుగు తొడిగారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగానే నగర పరిధిలోని ఎన్టీఆర్‌, వైఎస్‌ తదితరుల విగ్రహాలన్నింటి ముఖాలకు ముసుగులు తొడిగిన అధికారులు పనిలోపనిగా కృష్ణుడి విగ్రహానికి ముసుగేయడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతయింది.

ముఖ్యంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన గ్రామ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటుగా రాకపోకలు సాగించే భక్తులు ముసుగులో ఉన్న విగ్రహానికే దండం పెట్టి వెళ్తుండడం బాధగా ఉందని వాపోతున్నారు.

  • Loading...

More Telugu News