Chandrababu: కేసీఆర్ కు ఊడిగం చేసేవాడొకడు కావాలి... అందుకు జగన్ తయారయ్యాడు: చంద్రబాబు
- జగన్ ను నాపైకి పంపిస్తున్నారు
- ఎవరొచ్చినా ఏమీ చేయలేరు
- నరసన్నపేట సభలో చంద్రబాబు ప్రసంగం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రచార సభ తర్వాత ఆయన నరసన్నపేట ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్, జగన్, మోదీలపై నిప్పులు కురిపించారు. రాష్ట్రంపై పెత్తనం చలాయించాలని చూస్తున్న కేసీఆర్ కు జగన్ దొరికాడని విమర్శించారు.
కేసీఆర్ కేసులు పెట్టి తనను జైల్లో తోస్తాడని జగన్ కు భయం అని, అందుకే నీ కాల్మొక్తా బాంచన్ అంటూ కాళ్ల దగ్గర పడున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేసీఆర్ కు ఊడిగం చేసేవాడొకడు కావాలని, అందుకు జగన్ తయారయ్యాడని విమర్శించారు. ఇలాంటి వాడ్ని తనపైకి ఉసిగొల్పుతున్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
"రాక్షసులు, కుక్కలు, బతకలేక ఇక్కడికి వచ్చారన్నావు. ఏం మాకు రోషం లేదనుకున్నావా? మా కష్టార్జితంతో సంపాదించిన ఆస్తికి నువ్వు వారసత్వం తీసుకోవాలని చూస్తే ఖబడ్దార్ కేసీఆర్ నిన్ను వదిలిపెట్టం!" అంటూ చంద్రబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు.
అంతకుముందు ఇచ్ఛాపురం సభలో చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పైనా విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఉద్ఘాటించిన చంద్రబాబు, అభివృద్ధి తాము చేయకపోతే సినిమా యాక్టర్ వచ్చి చేస్తాడా? అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కోడికత్తి నేతలతో పాటు పవన్ కల్యాణ్ కు కూడా ప్రజల సమస్యల పట్ల అవగాహన లేదని అన్నారు.