Police: మొదటిసారి చోరీ చేస్తే కుడిచేయి, రెండోసారి కూడా చేస్తే ఎడమపాదం నరికివేత.. బ్రూనై దేశంలో కఠిన చట్టాలు!
- దిగ్భ్రాంతి చెందిన అంతర్జాతీయ సమాజం
- మండిపడుతున్న మానవహక్కుల సంఘాలు
- నిర్ణయాన్ని సమీక్షించాలన్న ఆమ్నెస్టీ
ముస్లిం దేశాలన్నీ ఇస్లాం ఆధారంగా తమ శిక్షా విధానాలకు రూపకల్పన చేస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయా దేశాల్లో విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉరితీయడం, శిరచ్ఛేదం, చేతులు, కాళ్లు నరికివేయడం వంటి శిక్షలు విధిస్తారు. ఆసియాలో అతి చిన్న దేశమైనా ఎంతో సంపన్న దేశంగా పేరుగాంచిన బ్రూనై కూడా ఇలాంటి శిక్షలనే అమలు చేస్తోంది. ఇక్కడ తొలిసారి దొంగతనం చేసి పట్టుబడిన వారికి కుడిచేయి నరికివేయాలని, రెండో సారి కూడా దొంగతనానికి పాల్పడితే ఎడమపాదం నరికివేయాలని కొత్తగా తీర్మానించారు. ఈ మేరకు కొత్త శిక్షల విధానాన్ని ప్రకటించారు. వచ్చే బుధవారం నుంచి ఇది అమలులోకి వస్తుందని బ్రూనై అధికారులు పేర్కొన్నారు.
అంతేకాదు, అక్రమ సంబంధాలు, స్వలింగ సంపర్కం వంటి అసహజ చర్యలకు పాల్పడేవారికి కూడా కఠిన శిక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి తప్పులు చేసినవారిని చనిపోయే వరకు రాళ్లతో కొట్టాలని నూతన శిక్షా విధానంలో పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాలు అత్యంత దారుణమని బ్రూనై విపక్షాలు ఎలుగెత్తుతున్నాయి. వాటికి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా తోడయ్యాయి. బ్రూనై తన కఠిన శిక్షల విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, అంతర్జాతీయ సమాజం నుంచి బ్రూనైని వెలివేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించింది.