Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌ను కాపాడలేకపోయిన శాంసన్ సెంచరీ.. హైదరాబాద్ అద్భుత విజయం
- ఈ సీజన్‌లో నమోదైన తొలి సెంచరీ
- సొంతమైదానంలో రెచ్చిపోయిన హైదరాబాద్
- భారీ స్కోరు చేసినా కాపాడుకోలేకపోయిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది.199 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి పాయింట్ల ఖాతా తెరిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే, సంజు శాంసన్‌లు చెలరేగిపోయారు. రహానే 49 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు చేసి అవుటవగా, శాంసన్ 55 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతడికి ఇది రెండో సెంచరీ కాగా, ఈ సీజన్‌లో నమోదైన తొలి సెంచరీ కూడా ఇదే.
అనంతరం 199 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ సొంత మైదానంలో చెలరేగి ఆడింది. డేవిడ్ వార్నర్ మరోమారు అద్భుతంగా ఆడాడు. 37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, బెయిర్‌స్టో 28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 45 పరుగులు చేశాడు.
విజయ్ శంకర్ కూడా మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లో ఫోర్, మూడు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఫలితంగా మరో ఓవర్ మిగిలి ఉండగానే హైదరాబాద్ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. బౌలింగ్‌లో ఓ వికెట్ తీసి, బ్యాటింగ్‌లో 8 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు చేసిన రషీద్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.