Chandrababu: మోదీ ఒక రోబో... కుటుంబ అనుబంధాల గురించి ఆయనకు తెలియదు: చంద్రబాబు

  • మోదీకి కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం
  • పిల్లలుంటే వాత్సల్యం తెలుస్తుంది
  • రావులపాలెం సభలో బాబు విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన కర్నూలు సభలో తనపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను సన్ రైజ్ స్టేట్ అంటూ వక్రభాష్యాలు చెబుతున్నారని, ఏనాడైనా కుటుంబం, అనుబంధాల గురించి తెలిస్తే పిల్లలపై ఉండే వాత్సల్యం కూడా తెలుస్తుందని విమర్శించారు.

మోదీకి, రోబోకి తేడా ఏముందని వ్యంగ్యం ప్రదర్శించారు. మోదీకి పిల్లలు ఉంటే ఇలా మాట్లాడరని అన్నారు. మోదీకి వ్యక్తిత్వమే లేదని ఆరోపించారు. "ప్రధానికి ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం తప్ప బంధాల గురించి ఏం తెలుసు? ఆయనొక మరమనిషి. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం తెలియదు. ఏపీకి ఎంతో చేశామని చెబుతున్నారు, విభజన చట్టంలో ఉన్నవే ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత 7 మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణం చేయనని చెప్పాను. పోలవరం ప్రాజక్టుకు ఇప్పటికీ కేంద్రం రూ.4,500 కోట్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. పెట్రో కెమికల్ కారిడార్ ఇవ్వకుండా మోసం చేస్తే కాకినాడలో ప్రయివేటు సంస్థతో పెట్రో కారిడార్ ఏర్పాటు చేసుకున్నాం. కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారు. ఆఖరికి విశాఖ రైల్వే జోన్ ఇస్తున్నామంటూ తల లేని మొండెం ఇచ్చారు. ఆదాయంలేని రైల్వే జోన్ ఎందుకు?" అంటూ చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు.

అంతకుముందు కర్నూలు సభలో మోదీ మాట్లాడుతూ, ఏప్రిల్ 11 తర్వాత రాష్ట్రంలో తన పుత్రోదయం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి ఆశలకు అస్తమయం తప్పదని చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News