Andhra Pradesh: జగన్ వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోతుంది.. పారిశ్రామికవేత్తలు పారిపోతారు!: సీఎం చంద్రబాబు హెచ్చరిక
- కేసీఆర్ ఆంధ్రవాళ్లను దున్నపోతులు, కుక్కలు అన్నారు
- కేసుల మాఫీ కోసం జగన్ కేసీఆర్ తో లాలూచీ పడ్డారు
- గుడివాడ బహిరంగ సభలో నిప్పులు చెరిగిన చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆంధ్రావాళ్లను దున్నపోతులు, కుక్కలు అని విమర్శించారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి వ్యక్తితో జగన్ కలిశారనీ, ఇది క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటు అని డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. అసలు ఏపీపై తెలంగాణ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రజలు రక్షణ కవచంలా ఉండాలన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడారు.
ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలుచేయాలని కోరినందుకు ప్రధాన మోదీ ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వస్తే ఎవ్వరూ అమరావతిలో పెట్టుబడులు పెట్టరనీ, పారిశ్రామికవేత్తలు సైతం పారిపోతారని వ్యాఖ్యానించారు. కేసుల కోసం కేసీఆర్ తో రాజీపడిన జగన్ ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల కోసం తాను ఐదేళ్లు కష్టపడ్డానని చంద్రబాబు తెలిపారు.
కాబట్టి రాష్ట్ర ప్రజలంతా తనకు వెన్నుదన్నుగా నిలవాలని చంద్రబాబు కోరారు. మరిన్ని సంక్షేమ పథకాలతో భవిష్యత్‌ను మార్చుకుందామని ప్రజలకు సూచించారు. ప్రపంచంలోని ఐదు అగ్ర నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పులతో ఏపీకి వచ్చామనీ, ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితికి వచ్చిందని వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ కంటే అమరావతి మిన్నగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలనీ, ప్రజల సంక్షేమం తన బాధ్యతని సీఎం అన్నారు. గుడివాడలో ఆక్వా హబ్ ఏర్పాటు చేస్తామనీ, తన నియోజకవర్గమైన కుప్పంకు దీటుగా గుడివాడను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు