RGV: వచ్చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ.. ఫస్టాఫ్ మొత్తం లక్ష్మీపార్వతే.. వర్మకు మళ్లీ నిరాశేనా?
- భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్
- సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
- ఫస్టాఫ్ మొత్తం లక్ష్మీపార్వతి-ఎన్టీయారేనట
ఎన్నో వివాదాలు.. ఇంకెన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా చుట్టూ అల్లుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి ఎన్నికల కోడ్ కారణంగా ఏపీలో ఈ సినిమా విడుదల వాయిదా పడగా, తెలంగాణ సహా ఓవర్సీస్‌లో సినిమా యథావిధిగా విడుదల అవుతోంది. అమెరికాలో ప్రీమియర్ షో చూసిన కొందరు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినట్టు చెబుతున్న విషయాన్ని ప్రధానాంశంగా తీసుకుని లక్ష్మీ పార్వతిని ఆకాశానికి ఎత్తేస్తూ చూపించినట్టుగా రివ్యూల ద్వారా తెలుస్తోంది. అత్యధిక మంది ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సినిమా తొలి అర్ధభాగంలో లక్ష్మీపార్వతి డబ్బా ఎక్కువైందనేది కొందరి వాదన. ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతి సన్నివేశాలు తప్ప ఫస్టాఫ్‌లో ఇతర సన్నివేశాలు లేనే లేవట. పరమ బోరింగ్‌గా ఉందని, చంద్రబాబు సన్నివేశాలు ఆకట్టుకోలేదని కొందరు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను ఈ సినిమాలో పూర్తిగా బయటపెట్టేశారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే వర్మ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడనేది ఓ టాక్.
మరికొందరు మాత్రం.. ఇటువంటి సినిమాను తీసినందుకు వర్మను అభినందించకుండా ఉండలేమని ప్రశంసిస్తున్నారు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మధ్య నడిచిన ఓల్డేజ్ లవ్ స్టోరీని ఆకట్టుకునేలా చూపించారని అంటున్నారు. సినిమాకు కల్యాణ్ మాలిక్ అందించిన సంగీతం బాగుందని కొనియాడుతున్నారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ అత్యద్భుతంగా నటించాడని, ఆ పాత్రకు అద్దినట్టు సరిపోయాడని అంటున్నారు. ఇలా రెండు రకాల వాదనలు వినిపిస్తుండగా, అసలు టాక్ ఏంటనేది మరికాసేపట్లో తేలిపోనుంది.