Andhra Pradesh: బదిలీ చేసింది సీఈసీ అయితే నాకు లేఖ రాసి ఏం లాభం?: ద్వివేది
- ఎస్పీల బదిలీకి కారణాలు చెప్పాల్సిన అవసరంలేదు
- మామూలు రోజుల్లోనే బదిలీకి కారణాలు చెప్పరు
- సంచలన వ్యాఖ్యలు చేసిన సీఈవో
ఏపీలో కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలకు స్థానచలనం అంశం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. మరో రెండు వారాల్లో ఏపీలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇద్దరు ఐపీఎస్ లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడం అధికార టీడీపీని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. తాజాగా ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు.
ఎస్పీల బదిలీపై కారణాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మామూలు రోజుల్లో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినా కారణాలు చెప్పరని వ్యాఖ్యానించారు. అయినా, ఎస్పీలను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం అయితే తనకు లేఖ రాయడం వల్ల ఉపయోగం ఉండదని టీడీపీ నేతలకు సూచించారు. ఇతర అంశాల గురించి మాట్లాడుతూ, జగన్ బెయిల్ రద్దు నిర్ణయం కోర్టు పరిధిలో ఉందని, ఆ విషయంలో తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయాలని టీడీపీ నేతలు కోరిన సంగతి తెలిసిందే.