Chandrababu: చంద్రబాబును పొరపాటున గెలిపిస్తే తనను ఎదిరించే వారి నెవ్వరినీ బతకనివ్వడు: వైఎస్ జగన్
- ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎన్నో మోసాలు
- మళ్లీ ఆయనకే ఓటేసి మోసపోవద్దు
- ఎన్నికల్లో విశ్వసనీయతకు ఓటేయాలి
ఈ ఎన్నికల్లో చంద్రబాబును పొరపాటున గెలిపిస్తే తనను ఎదిరించే వారి నెవ్వరినీ బతకనివ్వడని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, మీ బంధువులను చంపి ఆ నేరాన్ని మీ పైనే నెడతారని ఆరోపించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎన్నో మోసాలు చూశామని, మళ్లీ ఆయనకే ఓటేసి ప్రజలు మోసపోవద్దని కోరారు.
చంద్రబాబు డ్రామాలు నమ్మితే నరమాంసం తినే రాక్షసుడిని నమ్మినట్టేనని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తే.. లారీ ఇసుక రూ.లక్షకు చేరుతుందని, ‘ఆరోగ్య శ్రీ’, ‘104’, ‘108’లు కనబడవని, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వరని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో బ్యాంకుల నుంచి వచ్చే రుణాలకు పూర్తిగా కటింగ్ పెడతారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో విశ్వసనీయతకు ఓటేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి రాగానే ‘నవరత్నాలు’తో వెలుగులు నింపుతామని జగన్ హామీ ఇచ్చారు.