Chandrababu: అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని కేసీఆర్ కు భయం పట్టుకుంది: చంద్రబాబు
- అందుకే నోటికొచ్చినట్టు తిడుతున్నాడు
- మనపై కుట్రలు చేస్తున్నాడు
- జక్కంపూడి సభలో చంద్రబాబు ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంరంభంలోకి జాతీయ నేతలను కూడా తీసుకువస్తూ తన పలుకుబడి చాటుకుంటున్నారు. తాజాగా మైలవరం నియోజకవర్గంలోని జక్కంపూడి కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభకు చంద్రబాబు పిలుపు మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
ఏపీ పురోగతిని చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందని, మనతో పోటీపడలేక చేతకానివాళ్లు, కుక్కలు అంటూ తిడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని విషయాల్లో మనమే నంబర్ వన్ గా రావడం చూశాక కేసీఆర్ లో అసహనం మరింత పెరిగిపోయిందని, అందుకే రాష్ట్రం ఎదగకుండా కుట్రలు పన్నుతూ, నోటికొచ్చినట్టు తిడుతూ, అన్నిరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధికి కూడా అడ్డుపడే స్థాయికి వచ్చాడని విమర్శించారు.
"పోలవరం ప్రాజక్టుకు అడ్డుతగులుతున్నాడు, నాగార్జున సాగర్ పై అభ్యంతరం చెబుతున్నాడు, రాయలసీమకు నీళ్లివ్వకుండా అడ్డుపడుతున్నాడు. చివరికి మన అమరావతి అభివృద్ధిలోకి వస్తే హైదరాబాద్ ను ఎవరూ పట్టించుకోరని కేసీఆర్ కుట్రలకు తెరలేపాడు" అంటూ నిప్పులు చెరిగారు.