Telugudesam: వివేకా హత్యకేసులో నిజాలు బయటికొస్తాయనే కడప ఎస్పీని బదిలీ చేశారు: లంక దినకర్
- తెలంగాణలో ఎన్ని ఫిర్యాదులొచ్చినా పట్టించుకోలేదు
- చట్టం అన్ని రాష్ట్రాలకు సమానం కాదా?
- ఈసీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పనిలేదు
ఏపీలో కీలక పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై టీడీపీ నేత లంక దినకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ తుదిదశకు చేరుకున్న సమయంలో నిజాలు బయటికి వస్తాయనే కడప ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. వీరిలో శ్రీకాకుళం ఎస్పీది మరింత దయనీయ పరిస్థితి అన్నారు. ఆయన బదిలీకి ఎలాంటి కారణంలేదని, ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా స్వీకరించాలని లంక దినకర్ ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందన్నది తాజా చర్యల ద్వారా అర్థమవుతోందని, తెలంగాణలో ఎన్నో ఆరోపణలు వస్తున్నా స్పందించని ఈసీ, ఏపీ విషయంలో ఎందుకు ఇలా వ్యవహరించాల్సి వస్తోందంటూ నిలదీశారు. చట్టం అన్ని రాష్ట్రాలకు సమానంగా వర్తింపచేయాలని, ఒకవేళ ఈసీపై ఒత్తిళ్లు వస్తున్నాయనుకుంటే ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని దినకర్ సూచించారు. బదిలీకి గురైన అధికారులు ఇవాళ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారని, తమను బదిలీ చేయడానికి కారణాలేంటో వాళ్లే అడిగే పరిస్థితి వచ్చిందని తెలిపారు.