Andhra Pradesh: అంతమాత్రం అవగాహన లేదా?: జగన్ కు లోకేశ్ కౌంటర్
- ప్రైవేటురంగంలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి
- ఈ విషయమై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది
- జగన్ కొత్తగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటున్నారు
- విశాఖపట్నంలో విద్యార్థులతో ఏపీ మంత్రి ముఖాముఖి
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన విషయంలో జగన్ కు ఎంతమాత్రం అవగాహన లేదని దుయ్యబట్టారు. ఏపీలోని ప్రైవేటు కంపెనీలు 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం జీవో ఇస్తే, జగన్ 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో ఈరోజు విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. అప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏ రంగంలో అయినా రాణించేలా యువత రాటుదేలాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పెద్దఎత్తున ఐటీ ఉద్యోగాలు వచ్చాయని లోకేశ్ తెలిపారు. 2019 ఎన్నికలు ఏపీకి చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కాలంలోనే చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో భారీగా అభివృద్ధి జరిగిందనీ, మరో ఐదేళ్లు అధికారం అప్పగిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని లోకేశ్ అన్నారు.