Tamilnadu: పెళ్లి రోజు చిరిగిన కొత్త దుస్తులు... రూ. 75 వేలు ఫైన్!
- తమిళనాడులో ఘటన
- రూ. 11 వేలు పెట్టి డ్రస్ కొనుగోలు చేసిన సుబ్రమణి
- చిరిగిపోవడంతో పరువు పోయిందని ఫిర్యాదు
తన పెళ్లి రోజున ధరించేందుకు కొనుగోలు చేసిన దుస్తులు వేసుకుంటుంటేనే చిరిగి పోగా, తనకా దుస్తులమ్మిన జౌళి దుకాణంపై కేసు పెట్టిన ఓ యువకుడు రూ. 75 వేల నష్టపరిహారాన్ని పొందాడు. ఈ ఘటన తమిళనాడులోని కొడుంగైయ్యూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి సుబ్రమణి అనే యువకుడికి 2016లో వివాహం జరిగింది.
వివాహానికి ముందు పురుసవాక్కంలోని ఓ జౌళి దుకాణంలో సుబ్రమణి రూ. 11 వేలు పెట్టి కొత్త బట్టలు కొన్నాడు. పెళ్లి రోజున అవి చిరిగిపోవడంతో, మామూలు దుస్తులు వేసుకుని పెళ్లి చేసుకున్నాడు. చిరిగిన దుస్తులతో తన పరువు పోయిందని, దీనికి నష్టపరిహారం ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తూ, వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించాడు. దీనిని విచారించిన న్యాయమూర్తి లక్ష్మీకాంతం సుబ్రమణికి రూ. 75 వేల నష్టపరిహారాన్ని, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5 వేలను ఇవ్వాలని తీర్పిచ్చారు.