Maharashtra: తనకు టికెట్ ఇవ్వలేదని... గాంధీ భవన్ లోని కుర్చీలన్నీ తీసుకెళ్లిపోయిన ముంబై కాంగ్రెస్ నేత!

  • ఎంపీ టికెట్ ను ఆశించి భంగపడ్డ అబ్దుల్ సత్తార్
  • పార్టీకి రాజీనామా 
  • ఇంకా ఆమోదించలేదన్న కాంగ్రెస్

ఎంపీ టికెట్ ను ఆశించి భంగపడ్డ ఓ కాంగ్రెస్ నేత, ముంబై గాంధీభవన్ లో ఉన్న 300 కుర్చీలూ తనవేనని, తాను వాటిని తీసుకెళ్లిపోతానని చెబుతూ, అనుచరగణంతో వచ్చి కుర్చీలన్నింటినీ తీసుకెళ్లిపోయారు. సిల్లోడ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్దుల్ సత్తార్, ఔరంగాబాద్ లోక్ సభ సీటును ఆశించగా, కాంగ్రెస్ మాత్రం ఎమ్మెల్సీగా ఉన్న సుభాష్ జంబాద్ వైపు మొగ్గుచూపింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అబ్దుల్ సత్తార్, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే అనుచరులను వెంటేసుకుని గాంధీభవన్ కు వెళ్లిన ఆయన, తన డబ్బులతో తెచ్చిన కుర్చీలను ఎందుకు ఉంచాలని ప్రశ్నిస్తూ, వాటిని తీసుకెళ్లారు. ఆ సమయంలో కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్త సమావేశం జరగనుండగా, కార్యకర్తలు కూర్చునేందుకు కుర్చీలు లేక, సమావేశాన్ని ఎన్సీపీ ఆఫీసుకు మార్చుకోవాల్సి వచ్చింది.

దీనిపై అబ్దుల్ సత్తార్ స్పందిస్తూ, అవి తన కుర్చీలని, కాంగ్రెస్ సమావేశాల నిమిత్తం తెచ్చి పెట్టానని, ఇప్పుడు పార్టీని వీడినందున వెనక్కు తెచ్చుకున్నానని అన్నారు. టికెట్ లభించిన వారే పార్టీ కోసం ఖర్చు చేయాల్సి వుంటుందని అన్నారు. కాగా, అబ్దుల్ సత్తార్ కు స్థానికంగా మంచి పట్టున్న నేతగా పేరుంది. సత్తార్ పార్టీని వీడటంపై జంబాద్ మాట్లాడుతూ, సత్తార్ అవసరం తమకుందని, ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని అన్నారు. ఆయనకు అవసరమై ఆ కుర్చీలు తీసుకెళ్లారేమోనని అన్నారు.

  • Loading...

More Telugu News